అమరావతి, విశాఖ: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని. ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావారణ శాఖ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ డైరక్టర్ ఎస్. స్టెల్లా ఈ విషయం తెలిపారు. . దక్షిణ అండమాన్ సముద్రంలో నెలకొన్న తుఫాన్ ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. దీనిలో భాగంగానే ఉత్తర దిశ నుండి బలమై వేడిగాలులు వీస్తున్నాయని తెలిపారు. వీటి కారణంగా శుక్రవారం ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్రస్థాయిలో వడగాల్పులు వీస్తాయని చెప్పారు . శనివారం ఉత్తర కొస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆది, సోమవారాల్లో కూడా రాష్ట్రంలో వడగాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లద్దని హెచ్చరించారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలన్నారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఉత్తర దిశ నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తీవ్ర వడగాలులు వీచాయని చెప్పారు. విజయవాడలో అత్యధికంగా 43డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందన్నారు రానున్న రోజుల్లో రాయలసీమ జిల్లాలో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
అండమాన్లో వాయుగుండం
దక్షిణ అండమాన్ సముద్రంలో ఇప్పటికే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 12 గంటల్లో ఇది మధ్య అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలకు చేరి మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది
ఈశాన్య దిశగా మయన్మార్ వైపు ప్రయాణించే అవకాశముందని పేరొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశముందని పేర్కొన్నారు.