విశాఖ స్టీఎల్ అమ్మకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
సెయిల్ కి కేటాయించినట్లు వైజాగ్ స్టీల్ కి గనులు కేటాయించాలి!
చట్ట సభల్లో నేరస్థులు ప్రజా చట్టాలు తేలేరు
ఎఫ్ ఆర్ టి ఐ శిక్షణా తరగతుల్లో డా. ఆలపాటి
కాకినాడ (వారధి ప్రతినిధి): దేశంలో పబ్లిక్ రంగ సంస్థలను విక్రయించడం ప్రజా నిర్ణయం కాదని లోటస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఆవరణలో ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ తూర్పుగోదావరి జిల్లా శాఖ నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యఅతిథిగా మంగళవారం హాజరై ఆయన మాట్లాడారు. సెయిల్ సంస్థకు కేటాయించినట్లు గనులు విశాఖ స్టీల్ కు కేటాయించి ఉంటే ఆ సంస్థకు నష్టాలు వచ్చేవి కాదని, నేడు అమ్మాల్సిన పరిస్థితి లేదని, పాలక ప్రభుత్వాల తప్పిదాల కారణంగానే విశాఖ స్టీల్ నష్టాల పాలయిందని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ కు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టగా అక్కడున్న పెట్టుబడికి 6 రెట్లకు పైగా భూమి విలువ పెరిగిందని, రైతులు 25 వేల ఎకరాలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నిమిత్తం ఇచ్చారని 43 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో విశాఖ స్టీల్ చెల్లిస్తుందని వివరించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయం సరైంది కాదని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. చట్టసభల్లో నేరస్తులు పెరిగిపోవడం వల్ల సరైన చట్టాలను, ప్రజామోదం యోగ్యం గల చట్టాలను తీసుకు రాలేకపోతున్నారన్నారు. వ్యవస్థ నేరస్తులు, దోపిడీ దారులు, అక్రమార్జన పరులకు ఆవాసమైతే దేశంలో సుపరిపాలన ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. మన వ్యవస్థలో పరిపాలన విభాగం సరిగా పనిచేయడం లేదంటే మొదటి ముద్దాయిలు ఓటర్లేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో 4.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నూతన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని, ఆమోదయోగ్యం కాని చట్టాలను ప్రజలపై రుద్దడం ప్రజాస్వామ్యం కాదని నియంతృత్వం అవుతుందని డాక్టర్ ఆలపాటి శ్రీనివాసరావు గుర్తు చేశారు.
సమాచార స్వేచ్ఛ మానవుని ప్రాథమిక హక్కుగా మిగిలిన అన్ని స్వేచ్ఛలకు గీటురాయిగా ఉండాలని 1949లో సమాచార హక్కును ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం చేసి విశ్వవ్యాప్తంగా సమాచార హక్కు ప్రాధాన్యత కల్పించిందని ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ జాతీయ అధ్యక్షుడు చేతన పేర్కొన్నారు. ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన ఆర్ టి ఐ చట్టంపై ప్రసంగించారు. సమాచార హక్కు చట్టాన్ని 70 కి పైగా దేశాలు అమలు చేస్తూ సుపరిపాలనకు, పాలనలో ప్రజల భాగస్వామ్యానికి, పారదర్శకత, జవాబుదారీ తనానికి పెద్దపీట వేస్తున్నాయని ఆయన వెల్లడించారు. గ్రామ సభలు, వార్డు సభలు సక్రమంగా జరగకపోతే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు కాదని ప్రజలు దీనిని విజయవంతం చేయాలని ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ జాతీయ మహిళా అధ్యక్షురాలు కామిరెడ్డి లలితాదేవి పిలుపునిచ్చారు. శిక్షణా తరగతుల్లో గ్రామ సభలు పై ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ ఆర్ టి ఐ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి లింగం గంగాధర్ ఉపాధ్యక్షుడు మొండి రవి, రాధ, చాందినీ, లావణ్య, సంధ్య, 3 జిల్లాల సభ్యులు శిక్షణా తరగతులలో పాల్గొన్నారు.