ఏమిటీ ఈ అవధుల్లేని వివక్ష!

కాకినాడ మున్సిపాలిటీ ఏర్పడినప్పటినుండి కొనసాగింపు!
దళితులకు చైర్మన్ స్థానం లేని కాకినాడ పుర పాలక సంస్థ
1866 నుండి చైర్మన్ పదవి దళితులు చేపట్టలేదంట!
నిగ్గుతేల్చిన సమాచార హక్కు చట్టం
(కామిరెడ్డి లలితాదేవి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)
బ్రిటిష్ పాలనా కాలంలో 1759 లోనే ఏర్పడిన కాకినాడ మున్సిపాలిటీ 1866లో అధికారికంగా మున్సిపాలిటీ గా అవతరించింది. అయితే 1907 నుండి మున్సిపాలిటీకి అధ్యక్షులు ఏర్పడ్డారు. అప్పటి నుండి ఇప్పటివరకు అనేకమంది అగ్రవర్ణాలు, బీసీలకు చెందిన వ్యక్తులు చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎస్సీ, ఎస్టీలకు భాగస్వామ్యంలో చైర్మన్లుగా అవకాశం లభించలేదు. దీనిపై కాకినాడకు చెందిన వై ఎస్ రావు అనే సమాచార హక్కు కార్యకర్త మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ వారిని ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు. దీనిపై స్పందించిన మున్సిపల్ యంత్రాంగం తమ వద్ద 1759 నుండి గాని 1866 గాని ఎలాంటి రికార్డు లేదని అయితే 1907 నుండి తమ వద్ద ఉన్న రికార్డును అందిస్తున్నట్లు తెలియజేస్తూ వివరాలను అందజేశారు. దీనిపై మున్సిపల్ యంత్రాంగాన్ని యదార్థగాథ సజీవ రూపం ‘వారధి’ వివరణ కోరగా తమ వద్ద అంతకుమించి ఎలాంటి రికార్డు లేదని కాకినాడ నగరపాలక సంస్థ మేనేజర్ కర్రి సత్యనారాయణ తెలియజేశారు.
మున్సిపల్ చైర్మన్ల చరిత్ర ఇదిగో…
1907లో దురిశేటి శేషగిరిరావు పంతులు 1914 వరకు చైర్మన్గా బాధ్యతలు చేపట్టగా ఆ పిమ్మట కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తి 1914 నుండి 1924 వరకు చైర్మన్గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత న్యాయవాది రావు సాహెబ్ దామోదర కృష్ణమూర్తి 1931 వరకు చైర్మన్గా పదవీ బాధ్యతలు నిర్వహించగా డాక్టర్ లక్కరాజు సుబ్బారావు అనంతరం 1938 వరకు మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. చావలి రామస్వామి 1943 వరకు బాధ్యతలు తదనంతరం చేపట్టగా పైడా వెంకటనారాయణ ఆ పిమ్మట 1944 వరకు మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఏడవ మున్సిపల్ చైర్మన్ గా రావు బహదూర్ పాద రామయ్య 1945 నుండి 1947 వరకు పదవీ బాధ్యతలు చేపట్టగా 1952 వరకు ఇంటి సీతాపతిరావు పదవీ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం సి వి కె రావు 1952 నుండి 1956 వరకు చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టగా 1959 వరకు దంటు భాస్కర రావు 1964 వరకు సుంకర అప్పారావు,  1972 వరకు పుట్టా వెంకటరమణమూర్తి కాకినాడ మున్సిపల్ చైర్మన్లుగా బాధ్యతలు నిర్వహించారు. 1981 ఉండి 1986 వరకు జ్యోతుల సీతారామమూర్తి మున్సిపల్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహించగా రెండవసారి కూడా 1987 నుండి 1992 వరకు ఆయన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం మహిళా న్యాయవాది ప్రభా ఈ జోసఫ్ 2000 వరకు మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టగా తదనంతరం నగరంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ బీరక చంద్రశేఖర్ 2000 నుండి 2005 వరకు మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2005 నుండి 2010 వరకు కవికొండల సరోజ తొలి మేయర్ గా అతి చిన్న వయస్కురాలిగా కాకినాడ నగర పాలక సంస్థకు బాధ్యతలు నిర్వహించారు. 2017 నుండి  ప్రస్తుత మేయర్ సుంకర పావని బాధ్యతలు వహిస్తున్నారు. ఈమె 17వ మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్ గా ద్వితీయ మేయర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దళిత చైర్మన్ కు చోటేది?
1907 నుండి 2017 వరకు సుదీర్ఘకాలంపాటు ఒక్క దళిత సామాజిక వర్గానికి వ్యక్తికి కాకినాడ మున్సిపల్ చైర్మన్ సీటు దక్కలేదంటే కులం దాని ప్రభావం ఇక్కడ ఎంత గొప్ప గా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 1950 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ, విద్య రిజర్వేషన్లు  అమలు చేస్తుండగా నేటికీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు ఒక్కగానొక్క దళితుడు చైర్మన్ గా, మేయర్గా ఎన్నిక కావడానికి రిజర్వేషన్లు కల్పించలేదంటే రిజర్వేషన్లు ఎంత చక్కగా అమలవుతున్నాయి అర్థం చేసుకోవచ్చు. దీనిపై ప్రస్తుత పాలకులు పెదవి విప్పి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పదవిని దళిత వర్గానికి కేటాయిస్తామని వెల్లడి చేయాల్సిన అవసరం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం

Fri Mar 26 , 2021
అమరావతి: 2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి గాను కేబినెట్‌ దీనిని ఆమోదించింది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Translate

Translate »